ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తున్నారు

ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తున్నారు

జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రి నారాయణ స్పందించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెద్ద మోడీ, చిన్న మోడీ రహస్య ఒప్పందం ఈ ఘటనతో రుజువైందని అన్నారు. జగన్ కేసు ట్రయల్స్ కు వచ్చే సమయంలో హైకోర్టు విభజన చేయడంలో పరమార్ధం ఏమిటని ప్రశ్నించారు. జగన్ పై ఉన్న కేసులను నీరు గార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ చట్టాల ప్రకారం పాలన సాగిస్తున్న రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం దారుణమని తెలిపారు. కోడి కత్తి కేసు విచారణపై ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్ పోలీసు వ్యవస్థను అవమానించారని ఆరోపించారు. విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం చేసిన వ్యక్తి వైసీపీ కార్యకర్తే అని అతని తల్లి, సోదరి స్వయంగా చెప్పారని అన్నారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్ధకు అప్పగించి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు.