ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియ.. మంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియ.. మంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మరోవైపు తెలంగాణ హైకోర్టులో సమ్మె విషయంలో జరుగుతోన్న పరిణామాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.. ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు మంత్రి పేర్నినాని... తెలంగాణలో ఆర్టీసీ కేంద్రంగా జరుగుతోన్న పరిణామాల ప్రభావం ఏపీపై ఉందన్న ఆయన.. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఏపీలో కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని వెల్లడించిన మంత్రి పేర్నినాని.. ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆర్టీసీ విలీనానికి అంగీకరించారని తెలిపారు. ఆర్టీసీ విభజన అనేది సాంకేతికపరమైన అంశం మాత్రమేనన్న ఏపీ మంత్రి.. విలీనానికి ఇబ్బంది లేకుండా సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తామన్నారు. విభజన జరగలేదన్న కేంద్రం.. ఏపీ,  తెలంగాణలకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు నిధులు ఎలా కేటాయించింది..? అని ప్రశ్నించారు.