అధికారులతో మాకు సమస్యలు లేవు..

అధికారులతో మాకు సమస్యలు లేవు..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంతో గానీ, ఇతర ఉన్నతాధికారులతో తమకెలాంటి సమస్యలేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మంత్రి వర్గ భేటీ అనంతరం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారుల సహకారం, అంతా కలిసి సమష్టిగా పనిచేయడం వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని అన్నారు. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు కొత్త విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదు తప్ప ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు స్పందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఫొని తుపాను వల్ల ఉద్యాన పంటలు నష్టపోయాయని.. బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించినట్టు మంత్రి స్పష్టం చేశారు.

'ఐదేళ్లలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతులు, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంది. ఇవాళ ప్రధానంగా కరువు, తుపాన్, త్రాగునీటి ఎద్దడిపై చర్చలు జరిగాయి. అలాగే ఎజెండా అంశాలైన వాతావరణం పరిస్థితులు ఉపాధిహామి పనులపై కూడా చర్చలు జరిగాయి. రైతులకు రూ. కోటి 40 లక్షల పరిహారం ఇవ్వాలి. తాగునీటి విషయంలో ఆర్థిక ఇబ్బందులు చూసుకోవద్దని సీఎం సూచించారు. కేంద్రం నుంచి రావల్సిన నరేగా నిధులపై అధికారులు మాట్లాడాలని చంద్రబాబు ఆదేశించారు. ఫణి తుఫాన్ వల్ల వ్యవసాయానికి రూ. 3 కోట్ల 39 లక్షల నష్టం వాటిల్లింది' అని సోమిరెడ్డి పేర్కొన్నారు.