మంత్రి తలసాని వైసీపీ అద్దె మైకు

మంత్రి తలసాని వైసీపీ అద్దె మైకు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై తలసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో ఓడిపోయే పార్టీ టీడీపీ అని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఏపీలో పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని చెప్పారు. దీనిపై ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పందించారు. మంత్రి తలసాని వైసీపీకి అద్దె మైక్ అని ఘాటుగా విమర్శించారు. ఏపీకి వచ్చి ఏదో చేసేస్తా అని తలసాని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు టీడీపీ ఏం చేసిందో ఏపీలో బీసీలను అడిగితే చెబుతారని అర్జునుడు తెలిపారు. డేటా లీక్‌ అయిందంటూ విజయసాయిరెడ్డి గగ్గోలు పెడుతున్నారని, కేసీఆర్, జగన్ బెదిరింపులకు ఎవరూ భయపడరని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు జగన్‌కు బుద్ది చెప్తారని అన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి పనికిమాలిన పనులు చేస్తున్నారని ఎమ్మెల్సీ అర్జునుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.