ఏపీ పోలీసులపై తలసాని తీవ్ర ఆరోపణలు

ఏపీ పోలీసులపై తలసాని తీవ్ర ఆరోపణలు

ఏపీ పోలీసులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 3న ఆంధ్రప్రదేశ్‌లో యాదవ గర్జన సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏపీలో తన అనుచరుల్ని పోలీసులు వేధిస్తున్నారని తలసాని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఏపీ ప్రభుత్వానికే నష్టం.. చంద్రబాబు ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతుల వారికి ఏపీలో తీవ్ర నష్టం జరుగుతోంది.. వారందర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేయిస్తామన్నారు.

పోలీసులు అనవసర నిబంధనలు పెడుతున్నారు. ఏపీలో ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదన్న సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలి. సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాం. చంద్రబాబు తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తే తప్పులేదు కానీ.. మేము ఏపీలో సభ నిర్వహించుకుంటే తప్పా?. ఏపీలో మా పార్టీ లేకపోయినా అక్కడ ప్రచారం చేస్తాం. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించాలని బహిరంగంగానే చెబుతాం. ఎవరికి ఓటేయాలో చెప్పకపోయినా.. ప్రభుత్వాన్ని ఓడించాలని మాత్రం చెబుతామని తలసాని ఘాటుగా వ్యాఖ్యానించారు.