చంద్రబాబుపై మండిపడ్డ తెలంగాణ మంత్రి 

చంద్రబాబుపై మండిపడ్డ తెలంగాణ మంత్రి 

సిద్ధిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెల్లి మల్లన్నను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి మల్లన్న దర్శనానికి రావడంతో ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్నం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని ఆలయాలకు మహర్ధశ కలిగిందని మంత్రి అన్నారు. మరో తిరుపతిని తలపించే విధంగా యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఆ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి పసుపు కుంకుమ పథకం తీసుకువచ్చారని ఆరోపించారు.

 రెండు నెలల్లో ఓడిపోయే పార్టీ టీడీపీ పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా వారిని నీ కడుపులో పెట్టి చూసుకుంటున్న సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు.  ఓటుకు నోటు కేసులో పారిపోయిన పిరికిపంద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టిన ఘనత చంద్రబాబుది మండిపడ్డారు. మతిభ్రమించిన చంద్రబాబు విషపూరితమైన మాటలు మాట్లాడటం మానుకోవాలని మంత్రి తలసాని హితువు పలికారు.