అంతా బాబే చేశారు...మేము ఇబ్బంది పడుతున్నామన్న బుగ్గన

అంతా బాబే చేశారు...మేము ఇబ్బంది పడుతున్నామన్న బుగ్గన

ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ రుణాలు తీసుకునే అంశంపై దుష్ప్రచారం  చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ఆర్ధిక పరిస్థితి ఈ విధంగా ఉండడానికి కారణం గత ప్రభుత్వమే కారణమని అన్నారు.

ఈ ప్రభుత్వం కూడా ఎస్డీఎల్ బారోయింగులకు వెళ్తే డబుల్ సబ్ స్క్రైబ్ అయిందని, ఏపీ ప్రభుత్వంపై నమ్మకం ఉండబట్టే డబుల్ సబ్ స్క్రైబ్ అయిందని అన్నారు. జూన్ నెలలో 8 రోజుల మాత్రమే ప్రస్తుత సర్కార్ ఓడీకి వెళ్లిందని జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రభుత్వం ఓడీకి వెళ్లలేదని అన్నారు. గత ఐదేళ్లుగా డిస్కంల బకాయిలు మొత్తంగా రూ. 14657 కోట్ల మేర పేరుకుపోయి ఉన్నాయని, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నా.. ఎక్కువ ధర ఉన్నా విండ్ పవర్ కోసం పీపీఏలు చేసుకోవడం వల్లే నష్టాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

2017లో 45 రోజుల్లోపే 36 పీపీఏలు చేసుకున్నారని అన్నారు. అంతే కాక మద్యం కంపెనీలకు ఎక్కువ ధరలు చెల్లిస్తున్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 10 శాతం మార్జిన్, ఏఆర్ఈటీ కానీ ప్రభుత్వానికి వచ్చేదే అని అయన అన్నారు. ఇల్లీగల్ కన్సట్రక్షన్లో చంద్రబాబు ఎందుకు ఉంటున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 3.62 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రభుత్వం దిగిన టీడీపీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. 

గత ప్రభుత్వం రూ. 42 వేల కోట్ల మేర చెల్లింపు బకాయిలు పెట్టిందని, ఏ విభాగంలో చూసినా 9 నెలల నుంచి బకాయిలనే మాట వినిపిస్తోందని అన్నారు. బడా కాంట్రాక్టర్ల చెల్లింపులు మాత్రం భారీగా చేశారని అన్నారు. ఐదు వేల కోట్ల రూపాయల మేర రుణాన్ని ఒక్క రోజే తీసుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని బుగ్గన పేర్కొన్నారు. ఎన్నికల ముందు టీడీపీకి నచ్చిన 8 మంది కాంట్రాక్టర్లకు రూ. 1087 కోట్లు చెల్లింపులు జరిపారని బుగ్గన విమర్శించారు.