'ముగ్గురు విలన్ల వల్లే ఏపీ ఆర్ధిక వ్యవస్థ కుదేలు..!'

'ముగ్గురు విలన్ల వల్లే ఏపీ ఆర్ధిక వ్యవస్థ కుదేలు..!'

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్థ కుదేలు కావడానికి ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైఎస్ జగనే కారణం అన్నారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు... మోడీ, కేసీఆర్, జగన్ అనే ముగ్గురు విలన్ల వల్లే ఏపీ ఆర్థిక పరిస్థితికి ఇబ్బందులు కలిగాయన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... గత ఐదేళ్లలో ఆశించిన స్థాయిలో పన్ను రాబడులు పెరగలేదని.. కానీ, మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం పెరిగిందన్నారు. మోడీ ఇబ్బందులను అధిగమించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసింది చంద్రబాబే నన్న యనమల... తెలంగాణ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచి.. ఏపీకి మాత్రం మోకాలడ్డారని మండిపడ్డారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులను కూడా కొత్త రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు యనమల రామకృష్ణుడు... అవుట్ స్టాండింగ్ అప్పులు భారం ఈ ఏడాది మార్చికి రూ 1,92,687 కోట్లుగా ఉందన్న ఆయన.. ఉడయ్ బాండ్స్ భారం రూ. 8,256 కోట్లు కేంద్రమే రాష్ట్రంపై మోపిందని విమర్శించారు. ఈ ఐదేళ్లలో రూ 95,564 కోట్లు అప్పుల భారం పడిందని వివరణ ఇచ్చారు యనమల. 14 వ ఆర్ధిక సంఘం లెక్కల్లో లోపాల వల్ల ఏపీకి ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు నష్టం జరిగిందన్నారు. రూ. 42 వేల కోట్లు రావాల్సి ఉండగా రూ. 22 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో వార్షిక వృద్ధి రేటు 11 శాతం ఉంటే.. కేంద్రం వృద్ధిరేటు 7 శాతం మాత్రమే ఉందని గుర్తు చేసిన యనమల... తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌ అధిక వృద్ధి రేటు సాధిస్తే కేసీఆర్ కు అసూయ పెరిగిందని వ్యాఖ్యానించారు.