లక్కీ గర్ల్ : మిషా నారంగ్!

లక్కీ గర్ల్ : మిషా నారంగ్!

సంక్రాంతి కానుకగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా ఓ కొత్త సినిమా ప్రకటన వెలువడింది. 'మత్తు వదలరా' తర్వాత శ్రీసింహా నటిస్తున్న రెండో సినిమా ఇది. విశేషం ఏమంటే దీనికి 'తెల్లవారిత గురువారం' అనే పేరు పెట్టారు. ఈ మూవీలో శ్రీసింహా సరసన ఇద్దరు అందాల భామలు నటిస్తున్నారు. వారిలో ఒకరు చిత్రా శుక్ల! ఇప్పటికే తెలుగులో 'మా అబ్బాయి, రంగులరాట్నం, సిల్లీ ఫెలోస్'లో చిత్రా శుక్లా నటించింది. అయితే మరో నాయికగా ఎంపికైనా మిషా నారంగ్ నిజంగా లక్కీ గర్ల్ అనిపిస్తోంది. హిందీ టెలీసీరియల్ 'దిల్ ఏ జిద్దీ హై'తో చక్కని గుర్తింపు తెచ్చుకున్న మిషా నారంగ్ ఇప్పుడు ఏకంగా మూడు చిత్రాలలో నటిస్తోంది. అవీ మూడు వేరువేరు భాషా చిత్రాలు కావడం మరో విశేషం. మోడలింగ్ నుండి బుల్లితెర నటిగా మారిన మిషా... విహాన్ నటిస్తున్న కన్నడ సినిమా 'లెగసీ'లో గత యేడాది తొలి అవకాశం అందిపుచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో శ్రీసింహా సరసన 'తెల్లవారితే గురువారం' చిత్రానికి ఎంపికైంది. అలానే తమిళంలో అధర్వ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది మిషా నారంగ్. మొత్తానికి ఉత్తరాది నుండి దక్షిణాదికి వచ్చిన ఈ బుల్లితెర చిన్నది మూడు భిన్నమైన భాషా చిత్రాలలో అవకాశాలు అందిపుచ్చుకోవడం విశేషం. మరి నటిగా పేరు తెచ్చుకుని ఏ స్థాయి విజయాలను తన కిట్ లో వేసుకుంటుందో చూడాలి.