జగన్నాథుని రత్న భండార్ తాళాలు మిస్సింగ్

జగన్నాథుని రత్న భండార్ తాళాలు మిస్సింగ్

దేశంలో దేవుళ్ల సొత్తుకే కన్నం వేసేవాళ్లు బయల్దేరారు. మొన్న తిరుమల స్వామివారి సొమ్ములపై చెలరేగిన దుమారం ఇంకా సద్దుమణగలేదు. తాజాగా సుప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామి ఖజానా (రత్న భండార్) తాళాలు కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వందల కోట్ల విలువైన రత్న భాండాగారంలోని స్వామివారి స్వర్ణాభరణాలు, వజ్రవైఢూర్యాలను ఎవరైనా కైంకర్యం చేశారా అని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

12వ శతాబ్దంలో నిర్మితమైన ఒడిషాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయ రత్న భండారంలో మొత్తం ఏడు గదులు ఉన్నాయి. వీటిలో రెండు మాత్రమే బయట ఉంటాయి. లోపలి ఐదు గదులలో స్వామివారి విలువైన ఆభరణాలు, వజ్రవైడూర్యాలెన్నో ఉన్నాయి. ఈ కానుకలను శతాబ్దాలుగా అనేక మంది రాజులు, భక్తులు స్వామివారికి సమర్పించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో 34 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 4న 16 మంది సభ్యుల ప్రత్యేక బృందం రత్న భండార్ లోని నగలను పరిశీలించింది. 

శ్రీ జగన్నాథ మందిర పాలకమండలి అధికారి ఒకరు లోపలి గదులలో అడుగుపెట్టకుండా బయటి నుంచే చూడాలని చెప్పారు. ఎందుకంటే ఆ గదుల తాళాలు చాలా కాలంగా కనిపించడం లేదు. దీంతో పరిశీలకుల బృందం సెర్చిలైట్ల వెలుతురులో పని ముగించాల్సి వచ్చింది. ఆ తాళాలు పూరీ జిల్లా అధికారుల దగ్గర కానీ, జగన్నాథ స్వామి ఆలయ పాలకమండలి దగ్గర కానీ లేవు. ఈ విషయాన్ని మేనేజింగ్ కమిటీ మెంబర్ రాంచంద్ర దాస్ మహాపాత్ర బయటపెట్టడంతో రాష్ట్రంలో పెద్ద కలకలమే రేగుతోంది. 

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై దాడికి ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాయి ప్రతిపక్షాలు, హిందూ ధార్మిక సంఘాలు. ముఖ్యంగా ప్రతిపక్ష బీజేపీ నేతలు, పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి సీఎం పట్నాయక్, న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనాపై విమర్శలు గుప్పిస్తున్నారు. సర్కార్, ఆలయ పాలకవర్గం నిర్లక్ష్య వైఖరికి ఈ సంఘటన నిదర్శనమని ఆరోపించారు. తక్షణమే దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు.