స్టార్క్, కమిన్స్ లు ఐపీఎల్‌కు దూరం

స్టార్క్, కమిన్స్ లు ఐపీఎల్‌కు దూరం

ఐపీఎల్ 2019 సీజన్ కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. దీంతో వచ్చే సీజన్ లో ఆసీస్ ఆటగాళ్ల మెరుపులు చూడలేం. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ గత సీజన్లో ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఈ సీజన్ కు అందుబాటులో ఉంటారో లేదో ఇంకా స్పష్టత లేదు. ఇక ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని ఆసీస్ స్టార్ హీటర్లు ఆరోన్  ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి బాటలోనే స్టార్ బౌలర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ కూడా చేరారు.

జైపూర్ వేదికగా డిసెంబర్ 18న ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ వేలం కోసం 1,003 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే స్టార్క్, కమిన్స్ లు తమ పేర్లను నమోదు చేసుకోలేదని సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే 15 రోజుల్లోనే ప్రపంచ కప్.. అనంతరం యాషెస్ సిరీస్ కూడా ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.