రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీరాజ్.. ఆ ఒక్క ఫార్మాట్‌కే ఎందుకు?

రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీరాజ్.. ఆ ఒక్క ఫార్మాట్‌కే ఎందుకు?

సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. టీ 20 ఇంటర్నేషనల్స్‌కు  రిటైర్మెంట్ ప్రకటించారు. 2012, 2014, 2016లో మహిళల వరల్డ్ టీ -20 మూడు ఎడిషన్లతో సహా 32 టీ 20 మ్యాచ్‌లకు భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మిథాలీ రాజ్.. ఇవాళ రిటైర్మెంట్‌ ప్రకటించారు. 2021 వన్డే ప్రపంచ కప్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవాలనేది నా కల.. నా జట్టును ఉత్తమస్థానంలో నిలపాలనుకుంటున్నానని బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో మిథాలీ రాజ్ పేర్కొంది. తనకు ఎంతగానో మద్దతు ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. దక్షిణాఫ్రికా జట్టుతో త్వరలోనే స్వదేశంలో జరగనున్న టీ-20 సిరీస్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలని భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. 

2006లో డెర్బీలో ఆడిన మహిళల తొలి టీ 20 నుంచి మిథాలీ రాజ్ కెప్టెన్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్‌తో ఆ విజయం సాధించినప్పటి నుండి, మిథాలీ రాజ్ మరో 88 మ్యాచ్‌లు ఆడి.. 2,364 పరుగులు సాధించింది. టీ-20లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ మహిళా క్రికెటరే మిథాలీయే. టీ-20లో 2 వేల పరుగుల మైలు రాయి దాటిన తొలి క్రికెటర్ కూడా ఆమె. కాగా, భారత మహిళల జట్టు సెప్టెంబర్ 24 నుండి దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను స్వదేశంలో ఆడనుంది.. తర్వాత 2020 ఫిబ్రవరి-మార్చిలో, టీ- 20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. మొదటి మూడు టీ 20 ఇంటర్నేషనల్స్‌కు జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లు సెప్టెంబర్ 5న ముంబైలో సమావేశం కానున్నారు. సూరత్‌లో జరిగే టీ-20 సిరీస్‌ తర్వాత బరోడాలో మూడు వన్డేలు జరుగుతాయి.