వైరల్: ఈ డబ్బు తీసుకొని ఈ కోడిపిల్లకి చికిత్స చేయరూ..!

వైరల్: ఈ డబ్బు తీసుకొని ఈ కోడిపిల్లకి చికిత్స చేయరూ..!

పసిపిల్లలు ఎంతో అమాయకంగా ఉంటారు. తప్పొప్పులతో సంబంధం లేకుండా అన్ని పనులను ఎంతో దయతో చేస్తుంటారు. వాళ్లపై సమాజం ఏర్పరచిన నియమాల ప్రభావం పిసరంతైనా ఉండదు. ప్రతి విషయంపై వాళ్ల ఆలోచనా విధానం చాలా సరళంగా ఉంటుంది. వాళ్లెపుడూ అందరినీ ప్రేమాస్పద దృష్టితోనే చూస్తారు. తమ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే క్షమాపణ కోరతారు. ఈ రోజుల్లో ఇలాంటివి పెద్దల నుంచి ఆశించడం అత్యాశే అవుతుంది. 

నిష్కల్మష పసిమనసుల గురించి తెలియజేసే సంఘటన మిజోరామ్ లో జరిగింది. మిజోరామ్ లో ఒక పసిబిడ్డ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఒక పసివాడు ఒక చేతిలో రూ.10 నోటు, రెండో చేతిలో గాయపడిన కోడిపిల్లని పట్టుకొని ఉన్నాడు. ఈ ఫోటో మిజోరామ్ రాజధాని ఐజ్వాల్ లోని సైరంగ్ ప్రాంతంలో నివసించే ఒక పిల్లాడిదిగా తెలిసింది.

వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం ఈ పసివాడు పొరపాటుగా ఒక కోడిపిల్లపై నుంచి సైకిల్ పోనిచ్చాడు. వెంటనే సైకిల్ ఆపి కోడిపిల్లను చేతుల్లోకి తీసుకొని తన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతా పోగేసి దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాడు. హాస్పిటల్ కి వెళ్లి అక్కడి డాక్టర్లకు గాయపడిన కోడిపిల్లను చూపించి దానికి వెంటనే చికిత్స చేయాలని కోరాడు.

ఈ డబ్బులు తీసుకొని కోడిపిల్లకి చికిత్స చేయాలని పిల్లాడు ఆస్పత్రిలో డాక్టర్ ని కోరినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సాంగా సేస్ పేరుతో ఒక యూజర్ ఈ పోస్ట్ ని షేర్ చేశారు. పోస్ట్ చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ పోస్ట్ పై లక్ష మందికి పైగా స్పందించారు. ఈ పోస్ట్ 80,000 సార్లకు పైగా షేర్ అయింది. ఈ పోస్ట్ పై సుమారు 10,000 కామెంట్లు వచ్చాయి.