బెంగాల్‌లో దీదీకి మరో షాక్

బెంగాల్‌లో దీదీకి మరో షాక్

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. ఇటీవ‌ల‌ ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు రాజీనామాలు చేసి బీజేపీలో చేర‌గా.. తాజాగా మ‌రో ఎమ్మెల్యే పార్టీ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్నారు. ఉత్తర్‌పారా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రబీర్ గోష‌ల్ తృణ‌మూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప‌ద‌వితోపాటు హుగ్లీ జిల్లా క‌మిటీ స‌భ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రక‌టించారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల ప్రయోజ‌నార్థం ఎమ్మెల్యేగా మాత్రం కొన‌సాగాల‌ని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీ ప‌ద‌వుల‌కు కూడా ఇష్టం లేక‌పోయినా బ‌ల‌వంతంగా రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలోని ఒక వ‌ర్గం త‌న‌ను టార్గెట్ చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు. కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలనే టార్గెట్ చేస్తోంది బీజేపీ.. కొంచెం అటు ఇటుగా ఉన్న నేతలను ఆహ్వానించి వెంటనే కండువా కప్పేస్తున్నారు కమలనాథులు.