రాజ్యాంగబద్ధంగానే పార్టీ మారాం..

రాజ్యాంగబద్ధంగానే పార్టీ మారాం..

గ్రూపు రాజకీయాలు, నాయకత్వ లేమితో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోందని.. భవిష్యత్తుపై భరోసా లేకే పార్టీ మారామని ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మూడింట రెండొంతల మంది ఎమ్మెల్యేలు కోరుకుంటే శాసనసభాపక్షం విలీనం కావొచ్చని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ విషయంలో స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ ఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం రాజ్యాంగ బద్ధమేనని స్పష్టం చేశారు. అవసరమైతే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. తమను అనవసరంగా విమర్శిస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.  

మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కోర్టు నోటీసులకు సమాధానం ఇస్తామన్నారు. రాజ్యాంగంలో 10 వ షెడ్యూల్‌ను తాము ఉపయోగించుకున్నామన్న ఆయన..తాము కూడా కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు.  బీజేపీ నేతలు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని.. మరి గోవా, త్రిపురల్లో ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించి టీఆర్‌ఎస్‌లో చేరామన్న ఆయన.. విలీనమైనా టీఆర్‌ఎస్‌ కండువాను ఇప్పటికీ కప్పుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, ఆత్రం సక్కం, సుధీర్‌రెడ్డితో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.