మోడీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ?

 మోడీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ?

ఎన్నికలు ఏడాది దూరంలో ఉండటంతో చివరిసారిగా... కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరవాత మోడీ ప్రభుత్వంలోనే లుకలుకలు కన్పిస్తున్నాయి. బీజేపీలోని కొంత మంది ఎంపీలు మోడీ వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిత్రులను మచ్చిక చేసుకునేందుకు నరేంద్ర మోడీ నాలుగోసారి తన కేబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

మిత్రుల కోసం..
మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత మిత్రుల సాయం బీజేపీకి మరింత పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అటుంచి... 2019 ఎన్నికల్లో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టాలంటే.. సొంతంగా కేవలం బీజేపీ వల్లే అయ్యే పనికాదని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. దీంతో ఈసారి మిత్రపక్షాలకు స్థానం కల్పిస్తూ కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలని మోడీ భావిస్తున్నారు. ముఖ్యంగా తాజాగా ఎన్డీఏలో చేరిన జనతాదళ్‌(యూ) అభ్యర్థులను కేబినెట్‌లోకి తీసుకోవాల్సి ఉంది. మరోవైపు అసంతృప్తితో ఉన్న శివసేనను కూడా మచ్చిక చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. దాదాపు బీజేపీని శత్రుపక్షంగా చూస్తున్న శివసేనకు ఇపుడు కేవలం ఒకే ఒక్కరు  (అనంత గీతే) కేబినెట్‌లో ఉన్నారు. అయితే కొత్తగా మరికొందరిని తీసుకునేందుకు మోడీ సుముఖంగా ఉన్నారా? అన్నది తేలాలి. అలాగే 2019లో ఎలాగైనా బీజేపీకంటే ఇంకా బాగా బలపడాలని భావిస్తున్న శివసేన కీలక సమయంలో అధికారం పంచుకుంటుందా అన్నది కూడా కీలక ప్రశ్నే. ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో 78 మంది మంత్రులు ఉన్నాయి. మరో నలుగురికి ఛాన్స్‌ ఉంది. టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు స్థానంలో మరొకరని తీసుకోవాల్సి ఉంది. అలాగే ఎన్నికల సంవత్సరంలో సమాచార, ప్రసారాల శాఖకు పూర్తి స్థాయి మంత్రి అవసరం కూడా. నితీష్‌ కూడా కాస్త భిన్న స్వరం వినిపిస్తున్న సమయంలో ఆయన పార్టీకి కొన్ని కీలక పోస్టులు దక్కవచ్చిన ఢిల్లీ సమాచారం.