ప్రభుత్వ పనితీరుపై ఏం చెప్పలేక మోడీ గతం తవ్వుతున్నారు

ప్రభుత్వ పనితీరుపై ఏం చెప్పలేక మోడీ గతం తవ్వుతున్నారు

ఐదేళ్లలో తన ప్రభుత్వం సాధించిన విజయాల గురించి చెప్పేదేం లేక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో జరిగిన విషయాలను తవ్వుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గురువారం మధ్యప్రదేశ్ లోని బీనాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ అధికార బీజేపీకి వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

'ఆయన ఉద్యోగాలు, రైతులు, రూ.15 లక్షలు, అచ్ఛే దిన్ గురించి మాట్లాడలేరు. ఆయన గతం గురించి మాత్రమే మాట్లాడగలరు' అని రాహుల్ ఎద్దేవా చేశారు. 'మోడీ జీ, ఐదేళ్ల క్రితం దేశం మిమ్మల్ని ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. మిగతావాళ్లేం చేశారో మీ నుంచి తెలుసుకోవాలని దేశం అనుకోవడం లేదు. భారత్ మీరేం చేశారు, ఏం చేస్తారో తెలుసుకోవాలనుకుంటోందని' అన్నారు. ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించకున్నా ఎన్నికల ప్రచారంలో మోడీ పదేపదే గాంధీల కుటుంబం గురించి తీవ్రంగా విమర్శిస్తుండటంతో రాహుల్ గాంధీ ఇలా స్పందించారని భావిస్తున్నారు.

రాఫెల్ జెట్ కొనుగోలు ఒప్పందంలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి రూ.30,000 విలువైన కాంట్రాక్ట్ వచ్చేలా మోడీ చూశారని, ఇదో కుంభకోణమని రాహుల్ మరోసారి చెప్పారు. తానొక్కడే దేశాన్ని నడుపుతున్నట్టు మోడీ భావిస్తున్నారని, వాస్తవంలో దేశప్రజలు నడుపుతున్నారని ఆయన అన్నారు.