గంగా హారతిలో పాల్గొన్న ప్రధాని మోడీ

గంగా హారతిలో పాల్గొన్న ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం తను పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో మెగా రోడ్ షో తర్వాత దశాశ్వమేథ ఘాట్ లో గంగా హారతిలో పాల్గొన్నారు. రోడ్ షోలో భారీ సంఖ్యలో జనం రావడంతో ప్రధాని మోడీ కాన్వాయ్ దశాశ్వమేథ ఘాట్ చేరడంలో కాస్త ఆలస్యమైంది. ఘాట్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు.

గంగా హారతిలో ప్రధాని పూర్తిగా భక్తిభావంతో మునిగిపోయారు. హారతి సాగుతుండగా కొంతసేపు ఆయన భజన చేస్తూ, కాసేపు హారతి పాటలకు కాళ్లు కదుపుతూ కనిపించారు. హారతికి ముందు పూజారులు వేదమంత్రోచ్ఛాటన చేశారు. వాతావరణం అంతా గంగామాత భక్తిలో మునిగి తేలింది.

గంగా మాత హారతి సాగినంతసేపు మోడీ చేతులు జోడించి నమస్కరించే ఉన్నారు. విరామం లేకుండా సాగిన శంఖనాదంతో పరిసరాలన్నీ ఒక దివ్య, అద్భుత అనుభూతిని కలిగించాయి. హారతి ముగిసిన తర్వాత ఘాట్ లో భజనలు జరిగాయి. అన్నివైపులా హర్ హర్ మహాదేవ్ నినాదాలు ప్రతిధ్వనించాయి. హారతి పూర్తయ్యాక ప్రధాని మోడీ గంగాజలంతో ఆచమనం చేశారు.

గంగా హారతికి ముందు ప్రధాని బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి దశాశ్వమేథ ఘాట్ వరకు 6 కిలోమీటర్ల మేర రోడ్ షో జరిపారు. రోడ్ షోలో కాశీ జనసంద్రం రోడ్లపైకి తరలి వచ్చినట్టు కనిపించింది.