మోడీ దళిత వ్యతిరేకి: రాహుల్‌

మోడీ దళిత వ్యతిరేకి: రాహుల్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున ప్రధాన పక్షాల ప్రచారం హోరెత్తింది. విజయం తమదేనని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన బీజేపీపై విమర్శలు గుప్పంచారు. అసలు సమస్యలు ప్రస్తావించకుండా ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. దళితులను బీజేపీ హింసిస్తోందని..కుల మతాల మధ్య చిచ్చుపెడుతోందని పేర్కొన్నారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యపై ప్రధాని ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మోడీ హయాంలో దళితులపై అకృత్యాలు పెరిగిపోయాయని, ఆఖరికి..దళితుల ఛాతీపైన కులం పేరు రాసిచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయన్నారు.

బీజేపీ తనన ఎలక్షన్‌ హిందూగా అభివర్ణించడంపై మండిపడిన రాహుల్‌.. గత పదిహేనేళ్లుగా తాను దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు తదితర మతపరమైన ప్రదేశాలకు వెళ్తున్నానని చెప్పారు. తాను గుడికి వెళ్తుంటే బీజేపీ బాధపడుతోందని రాహుల్‌ అన్నారు. తాను ఎక్కడా ఏ మతానికీ వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. సోనియా గాంధీపై ప్రధాని విమర్శలపై స్పందిస్తూ.. తాను చూసిన పలువురు భారతీయుల కన్నా తన తల్లి ఎక్కువ దేశభక్తి కలిగినవారేనని చెప్పుకొచ్చారు.  ఈ ఎన్నికలు కర్ణాటక ప్రజల భవితవ్యానికి సంబంధించినవని అన్నారు.