మళ్ళీ ట్రంపే గెలవాలి...మోడీ పిలుపు

మళ్ళీ ట్రంపే గెలవాలి...మోడీ పిలుపు

హౌడీ-మోడీ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ హూస్టన్ వేదికగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మరోపక్క ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు ట్రంప్. ఇరువురు నేతలకు ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ హ్యూస్టన్‌లోని ఎన్‌‌ఆర్‌జీ స్టేడియంలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వేదికను పంచుకున్నారు. 70 వేల మందికి పైగా ప్రవాస భారతీయులతో స్టేడియం కిక్కిరిసిపోయింది.  భారత్ మాతా కీ జై, వందే మాతరం, మోడీ..మోడీ  వంటి నినాదాలతో హోరెత్తించారు ఎన్నారైలు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు, మేయర్లు ఈ కార్యక్రమానికి హాజర్యయారు. వేదిక వద్దకు విచ్చేసిన ట్రంప్‌కు భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ స్వాగతం పలకగా, మోడీ వేదికపైకి తోడ్కొని వెళ్లారు.  

భారత్‌కు నిజమైన శ్వేతసౌధ స్నేహితుడు ట్రంప్‌ అంటూ కొనియాడారు మోడీ. అబ్‌కే బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటూ  మళ్లీ ట్రంప్‌ అధికారంలోకి రావాలని ఆకాక్షించారు. ఈ దీపావళి సంబరాల్లో ఆయన మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మోడీ. దేశం బాగుందంటూ మోడీ తొమ్మిది భాషల్లో మాట్లాడారు. అంతా బాగుంది అనే పదాన్ని హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా, తెలుగు,కన్నడ, తమిళంతోపాటు మరో భాషలో పలికారు.

తాను అన్ని భాషల్లో ఏం చెప్పానో మళ్లీ ట్రంప్‌కు వివరించారు ప్రధాని మోడీ. దీంతో అక్కడున్నవారిలో నవ్వులు పూశాయి. భారత్‌లో ఈసారి ఎన్నికల్లో 8కోట్ల మంది కొత్త ఓటర్లు ఓటేశారని వివరించిన మోడీ 60 ఏళ్ల తర్వాత భారత్‌లో అత్యంత బలమైన ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. ఐదేళ్ల పాలన తర్వాత మరింత శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. ఇదంతా భారతీయుల సంకల్పం వల్ల జరిగిందని అన్నారు మోడీ.