రాహుల్‌పై మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు

రాహుల్‌పై మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు

హిందువులు అధికంగా లేని వేయనాడ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.ఆయన మహారాష్ట్రాలోని వార్దాలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మాట్లాడారు.శాంతి కాముకులైన హిందువులను "హిందూ తీవ్రవాదం" పేరుతో కాంగ్రెస్‌ పార్టీ అవమానపర్చిందని ప్రధాని ఆరోపించారు. మహారాష్ట్రకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఈ పదాన్ని ఉపయోగించారని అన్నారు. మనదేశాన్ని పాలించిన బ్రిటీషర్లు కూడా ఏనాడూ హిందువులను ఇలా సంబోధించలేదని మోడీ ఆరోపించారు. గడచిన 5000  ఏళ్ళ చరిత్రలో హిందువులు ఎపుడూ, ఎక్కడా తీవ్రవాదానికి పాల్పడలేదని ఆయన అన్నారు. అలాంటి హిందువులను తీవ్రవాదులని ఆరోపించి... వారి మనోభావాలను కాంగ్రెస్‌ దెబ్బతీసిందని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్‌ చేసిన ఈ నిందలను హిందువులు గుర్తించారని, చైతన్య వంతులయ్యారని... దీంతో తనకు ఓట్లు పడవని అమేథీ నుంచి పారిపోయారని మోడీ ఆరోపించారు. హిందువుల సంఖ్య తక్కువగా ఉన్న వేయనాడ్‌ నియోజకవర్గం నుంచి రాహుల్‌ పోటీ చేస్తున్నారని మోడీ ఆరోపించారు.