గత ఏడాది మోడీ పార్లమెంట్ లో ఉన్నది 24 గంటలే

గత ఏడాది మోడీ పార్లమెంట్ లో ఉన్నది 24 గంటలే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది పార్లమెంటుకి వచ్చిన సమయం కంటే 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగాలకు ఎక్కువ సమయం కేటాయించారు. ఇదేదో అల్లాటప్పా గాలి కబురు కాదు. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఒబ్రీన్ చెప్పారు. పార్లమెంట్ రికార్డుల ఆధారంగా తను ఈ విషయం చెబుతున్నట్టు ఒబ్రీన్ గురువారం రాజ్యసభలో తెలిపారు. వారణాశి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధాని మోడీ, గత ఏడాది పార్లమెంటులో 24 గంటలు మాత్రమే గడిపారు. అందులో రాజ్యసభలో 10 గంటలు, లోక్ సభలో 14 గంటలు ఉన్నాయి. కానీ మోడీ గుజరాత్ ప్రచారంలో 37 గంటల పాటు ప్రసంగించారని ఒబ్రీన్ వివరించారు. 

‘ప్రజాకర్షక నేత ప్రసంగాలు ఇవ్వడంపై తనకే అభ్యంతరం లేదని’ ఒబ్రీన్ అన్నారు. ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రసంగిస్తుంటారని’ అన్నారు. ‘కానీ ఉండాల్సిన సమతుల్యత ఏదని’ ఆయన ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్ పై చర్చ సందర్భంగా ఒబ్రీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇవాళ మన ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ కూర్చొని మన చర్చ విని ఉంటే ఎంతో బాగుండేది. ఆయన తన ధోరణి మార్చుకుంటారేమో’నని అన్నారు.