వారికా బాగా బుద్ధి చెప్పారు: మోడీ

వారికా బాగా బుద్ధి చెప్పారు: మోడీ

బీజేపీని ఉత్తర భారతదేశ పార్టీ అని, హిందీ మాట్లాడే పార్టీ అని అబద్ధాలు ప్రచారం చేసేవారికి కర్ణాటక ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ప్రధానమంత్రి మోడీ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో అధికసీట్లు సాధించి ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మోడీ మాట్లాడారు. 'బీజేపీ ఇప్పటివరకు హిందీ భాష పార్టీ అనేవాళ్లు. గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, అసోం ఇవేవీ హిందీ భాష రాష్ట్రాలు కావు. ఇప్పుడు కర్ణాటక ఈ అపవాదు తప్పని మరోసారి నిరూపించింది' అని అన్నారు. కొంతమంది ఉత్తరాది, దక్షిణాది భేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో విజయం అసామాన్యమైనదని పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలు తన పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపించారన్నారు. 'గతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర భాష రాదని ఎగతాళి చేసేవారు. కర్ణాటక ప్రజలు ఎలాంటి భేదభావాలు లేకుండా నన్ను ఆదరించారు. భాష తమ మధ్య ఏ మాత్రం అడ్డుకాలేదు' అని ప్రధాని అన్నారు. ఇక.. ఇవాళ వారణాసి ప్రమాదం జరగడంతో  కర్ణాటక విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నామని చెప్పారు.