రాఫెల్‌పై ద హిందూ సంచలన కథనం

రాఫెల్‌పై ద హిందూ సంచలన కథనం

బోఫోర్స్‌ కుంభకోణాన్ని వెలికి తెచ్చిన ద హిందూ పత్రిక ఇవాళ రాఫెల్‌ విమానాల కొనుగోలుపై ప్రత్యేక పరిశోధనాత్మక కథనం రాసింది. ఇవాళ ప్రచురించిన ఈ కథనాన్ని పత్రిక ఛైర్మన్ ఎన్‌ రాయ్‌ రాయడం విశేషం.  రాఫెల్‌ యుద్ధ విమానాన్ని 126కు బదులు 36 మాత్రమే కొనుగోలు చేయడం వల్ల విమానాల ధరలు 41.42 శాతం పెరిగినట్లు పత్రిక రాసింది. యుద్ధవిమానాలకు అదనపు హంగులు ఇవ్వడం వల్ల ధరలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే 2007, 2011తో పాటు 2016లో ఈ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కీలక నిర్ణయాలు జరిగాయని, వీటి కారణంగానే ధరలు పెరిగాయని అంటూ..ఆ మూడు దశల్లో జరిగిన నిర్ణయాలు, వాటి ప్రభావాన్ని పత్రిక వివరించే ప్రయత్నం జరిగింది.  2007లో విమానం డిజైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కోసం అయ్యే ఖర్చు 11.11 మిలియన్‌ యూరోలుగా కాగా (ఒక్కో విమానానికి) 2016లో మోడీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే నాటికి ఈ ఖర్చు 36.11 మిలియన్‌ యూరోలకు పెరిగిందని పత్రిక పేర్కొంది.దీనివల్ల మొత్తం డీల్‌ విలువ 90.41 మిలియన్‌ యూరోల నుంచి 127.86 మిలియన్‌ డాలర్లకు పెరిగిందని ద హిందూ పేర్కొంది.  డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వ్యయం 126 విమానాలకు బదులు 36 విమానాలకు వర్తింపజేయడంతో డీల్‌ విలువ భారీగా పెరిగిందని పత్రిక పేర్కొంది. అలాగే ప్రభుత్వానికి దక్కాల్సిన 9 శాతం డిస్కౌంట్‌.. పూర్తి విమాన వ్యయంపై కాకుండా.. కేవలం బేసిక్‌ ధరపై ఇచ్చారని పేర్కొంది.