ఆ ఘనత సాధించిన రెండో బౌలర్ షమీనే!!

ఆ ఘనత సాధించిన రెండో బౌలర్ షమీనే!!

వరల్డ్ కప్ 2019లో మొదటి మ్యాచ్ ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ అదరగొట్టేశాడు. చివరి ఓవర్ లో హ్యాట్రిక్ సాధించి భారత్ 11 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. శనివారం సౌథాంప్టన్ లోని జరిగిన ద రోజ్ బౌల్ లో జరిగిన మ్యాచ్ లో 28 ఏళ్ల పేసర్ ఓ ఘనత సొంతం చేసుకున్నాడు. 2019 ఐసీసీ వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ మ్యాచ్ లో చేతన్ శర్మ తర్వాత హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్ షమీనే.

భారత్ ఆడిన మొదటి నాలుగు మ్యాచ్ లలో తుది జట్టులో స్థానం సాధించని షమీ, భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడాడు. షమీ నాలుగు వికెట్లు తీశాడు. కేవలం 40 పరుగులు ఇచ్చిహజ్రతుల్లా జాజయ్(10), మొహమ్మద్ నబీ(52), ఆఫ్తాబ్ ఆలమ్(0), ముజీబుర్ రెహ్మన్(0) వికెట్లను పడగొట్టాడు. ఆఫ్ఘనిస్థాన్ మొండి పట్టుదలతో చివరి వరకు పోరాడటంతో టీమిండియా చివరి ఓవర్లలో తీవ్ర ఉత్కంఠకు గురైంది. చివరి ఓవర్ లో ఆఫ్ఘనిస్థాన్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా నబీ అర్థ సెంచరీకి చేరువలో ఉన్నాడు. షమీ వేసిన మొదటి బంతిన నబీ బౌండరీ బాది తన 13వ వన్డే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాతి బంతికి పరుగులివ్వని షమీ విజృంభించి నబీ, ఆలమ్, ముజీబ్ లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. మరో బంతి మిగిలి ఉండగానే జట్టుకు విజయం సాధించి పెట్టాడు.

1987 వరల్డ్ కప్ లో మాజీ ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ సాధించి ఆ ఘనత సాధించిన ఏకైక భారత బౌలర్ గా రికార్డు స్థాపించాడు. ఇన్నేళ్లకి షమీ ఆ రికార్డును సమం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన 10 మంది బౌలర్ల సరసన స్థానం సంపాదించాడు.