విద్యార్థుల ఆత్మహత్యలపై మోహన్‌బాబు

విద్యార్థుల ఆత్మహత్యలపై మోహన్‌బాబు

తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను విడుదల చేసిన తర్వాత 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరినీ ఆవేదన గురిచేసింది. ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలే ఇందుకు కారణమని పొలిటిక్ పార్టీలో మండిపడుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై ఓ ప్రకటన విడుదల చేశారు సినీ నటుడు మంచు మోహన్‌బాబు... తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రకటన విడుదల చేసిన ఆయన.. ''భగవంతుడు జన్మనిచ్చింది ఆఖరి శ్వాస వరకూ జీవించడానికి.. ఆ జీవితాన్ని మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు తల్లడిల్లిపోతారు. ఇది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒక విద్యాసంస్థ అధినేతగా వేల మంది విద్యార్థుల్ని అనుక్షణం నీడలా అనుసరిస్తూ, వాళ్లకు మనోనిబ్బరాన్ని కలిగిస్తున్న నాకు.. తెలంగాణ రాష్ట్రంలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనసును కలచివేసింది. ప్రభుత్వం స్పందించింది.. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. ఈలోగా దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, మీరే సర్వస్వంగా జీవిస్తున్న తల్లిదండ్రుల హృదయాలను శిక్షించకండి. వారు ఎప్పుడూ మీ ఉన్నతినే కోరుకుంటారు. వారి కోసం, వారి సంతోషం కోసం కళకళలాడుతూ వారి కళ్లముందు ఎదిగి చూపిస్తామని నిర్ణయం తీసుకోండి'' అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇంటర్ ఫలితాల్లో అవకతవలపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే నివేదిక తయారు చేసింది. తన నివేదికలో కీలక సూచనలు చేసిన కమిటీ.. ఇవాళే తన నివేదికను విద్యాశాఖకు అందజేయనుంది.