భారత వృద్ధి రేటుపై మూడీస్ తాజా అంచనా ఇదే..

భారత వృద్ధి రేటుపై మూడీస్ తాజా అంచనా ఇదే..

2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాల్లో ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్ భారీగా కోత విధించిన సంగతి తెలిసిందే‌... దాదాపు 10.5 శాతం తగ్గిపోనుందని అంచనా వేసింది. గతంలో ఇదే కాలంలో జీడీపీ 5 శాతం కుంగొచ్చని తెలిపిన సంస్థ.. కరోనా మహమ్మారి విజృంభణ, దాని ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మరింత కోత విధించింది. ఇక, తాజాగా, 2020-21 సంబంధించి భారత వృద్ధి రేటు అంచనాలను మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ కూడా వెలువరించింది. ఈ ఏడాది 11.5 శాతం మేర వృద్ధి క్షీణించొచ్చని పేర్కొంది మూడీస్.. గతంలో క్షీణత 4 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసినా.. తాజాగా దానిని సవరిస్తూ 11.5 శాతంగా సవరించింది. కరోనా కారణంగా తక్కువ వృద్ధి, అధిక అప్పులు, బలహీన ఆర్థిక వ్యవస్థ.. వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంది మూడీస్. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-2022)లో వృద్ధి పుంజుకుంటుందని అంచనా వేసింది మూడీస్. ఆ వృద్ధి రేటు 10.6 శాతం మేర నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తానికి కరోనా మహమ్మారి ప్రభావం భారత వృద్ధిరేటుపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.