హోం ఐసోలేష‌న్‌లోనే 12 వేల మంది.. డాక్ట‌ర్ చెప్ప‌కుండా అన్ని మందులు వాడొద్దు..!

హోం ఐసోలేష‌న్‌లోనే 12 వేల మంది.. డాక్ట‌ర్ చెప్ప‌కుండా అన్ని మందులు వాడొద్దు..!

తెలంగాణ‌లో హోం ఐసోలేష‌న్‌లోనే ఉండి క‌రోనాకు చికిత్స తీసుకునేవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి... అయితే.. క‌రోనా ట్రీట్‌మెంట్‌కు ఉప‌యోగించే మందుల విష‌యంలో ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందంటున్నారు వైద్య శాఖ అధికారులు.. కొన్ని మందులను డాక్టర్ చెప్పకుండా వాడొద్దు అని సూచిస్తున్నారు. ఇక‌, అత్యధిక ధరలకు మందులు అమ్మేవారిపై చ‌ర్యలు తీసుకుంటాం అన్నారు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీ‌నివాస్‌.. ఎన్టీవీతో ప్ర‌త్యేకంగా మాట్లాడిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం.. 12 వేల మందికి పైగా క‌రోనా రోగులు.. హోం ఐసోలాషన్‌లో ఉన్నార‌ని వెల్ల‌డించారు.

హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారిని కాల్ సెంటర్‌కి కనెక్ట్ చేసి వైద్య సలహాలు అందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు శ్రీ‌నివాస్‌.. హోం ఐసోలాషన్‌లో ఉన్న వారికి ఐసోలేషన్ కిట్స్ కూడా అందిస్తున్న‌ట్టు తెలిపారు. ఇక‌, యాంటీజెన్ కిట్లు వినియోగించి గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ్యాప్తంగా క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. మ‌రోవైపు.. టిమ్స్ ఆస్ప‌త్రి అందుబాటులోకి వచ్చింద‌ని.. అక్కడ అన్ని వసతులు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.. అంతేకాకుండా.. గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌కు మంచి వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు శ్రీ‌నివాస్‌.. కరోనా రోగుల కాంటాక్ట్ ట్రెసింగ్ కూడా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.