రోహిత్ రికార్డును అధిగమించిన ధోనీ

రోహిత్ రికార్డును అధిగమించిన ధోనీ

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన తొలి వన్డేలో టీంఇండియా ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్య ఛేదనలో 99 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను కేదార్‌ జాదవ్‌ 81 (87 బంతుల్లో; 9 ఫోర్లు, 1 సిక్స్‌), మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 59 (72 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు అజేయ అర్ధ సెంచరీలతో ఆదుకుని విజయాన్ని అందించారు. అర్ధ సెంచరీతో రాణించిన ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియా తరుపున అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ రికార్డును ధోనీ అధిగమించాడు.

ఉప్పల్ మ్యాచ్ ముందు వరకు రోహిత్ శర్మ, ధోనీలు 215 సిక్సులతో భారత్ నుంచి మొదటి స్థానంలో ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌లో ఒక సిక్సు కొట్టిన ధోనీ.. 216 సిక్సులతో మొదటి స్థానంలోకి వచ్చాడు. రోహిత్ 202 వన్డేల్లో 215 సిక్సులు కొట్టగా.. ధోనీ 336 వన్డేల్లో 216 సిక్సులు బాదాడు. ఈ జాబితాలో 195 సిక్సులతో సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (189), యువరాజ్ సింగ్ (153), వీరేంద్ర సెహ్వాగ్ (131)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.