వైవిధ్యమే జగపతిబాబు ఆయుధం

వైవిధ్యమే జగపతిబాబు ఆయుధం

జగపతిబాబు అనగానే ఈ తరం వారికి ఆయన విలక్షణమైన అభినయం గుర్తుకు వస్తుంది.. అనేక చిత్రాల్లో విలన్ గా భయపెడుతున్న జగపతిబాబు కొన్ని సినిమాల్లో సాఫ్ట్ రోల్స్ లోనూ మురిపిస్తున్నారు.. బాబు వైవిద్యమైన నటనకు పరభాషా దర్శకులు సైతం పరుగులు తీస్తూ వచ్చి, ఆయనను తమ చిత్రాలలో నటింప చేసుకుంటున్నారు. తాజాగా ఆయన నటించిన 'ఎఫ్.సి.యు.కె.' విడుదలవుతోంది. అదీ జగపతిబాబు బర్త్ డే కానుకగా రావడం విశేషం. ఆయన హీరోగా సాగుతున్న సమయంలోనూ పుట్టినరోజు కానుకగా సినిమాలు వచ్చినట్టు లేవు. కానీ, ఇప్పుడు కేరెక్టర్ రోల్స్ లో బిజీ బిజీగా సాగుతున్న జగపతిబాబుకు తాజా చిత్రం ఓ గిఫ్ట్ అనే చెప్పాలి. 

ముచ్చటగా మూడుసార్లు...
ఇప్పుడంటే ఇలా ఓల్డ్ మేన్ రోల్స్ లో కనిపిస్తున్నారు కానీ, ఒకప్పుడు జగపతిబాబు మరో శోభన్ బాబులా సాగారు. ఎందుకంటే, శోభన్ తరువాత ఇరువురు భామల నడుమ నలిగే పాత్రల్లో అంతగా ఆకట్టుకున్నది జగపతిబాబు అనే చెప్పాలి. జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ చిన్నకొడుకు జగపతిబాబు. అంత పెద్ద దర్శకనిర్మాత తనయుడు కాబట్టి జగపతిబాబుకు చిత్రసీమ ఎర్రతివాచీ పరచిందేమీలేదు. తండ్రి తొలుత జగపతిబాబు హీరోగా 'సింహస్వప్నం' నిర్మించారు. తొలి చిత్రంలోనే జగపతిబాబు ద్విపాత్రాభినయం చేశారు. ఆ చిత్రం నిరాశను మిగిల్చింది. తరువాత సినిమాలు కూడా అంతగా అలరించలేదు. చివరకు జగపతిబాబు గొంత కూడా కొందరు దర్శకులకు నచ్చలేదు. దాంతో వేరేవారితో జగపతిబాబుకు డబ్బింగ్ చెప్పించారు. 'పెద్దరికం' చిత్రం హీరోగా బాబుకు బ్రేక్ నిచ్చింది. తరువాత రామ్ గోపాల్ వర్మ 'గాయం'నటునిగా గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాతో జగపతిబాబుకు ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది. ఆ తరువాత వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తూ సాగారు. 'మావిచిగురు, మనోహరం' చిత్రాలతోనూ ఉత్తమ నటునిగా నందిని అందుకున్నారు. 

బిజీ బిజీగా... 
జగపతిబాబు కాల్ షీట్స్ కు ఒకానొక సమయంలో విశేషమైన డిమాండ్ ఉండేది. ప్రేమికునిగా, ఇంటిపెద్దకొడుకుగా, ఓ మంచిభర్తగా, అన్యాయాన్ని ఎదిరించే ఆదర్శభావాల నాయకునిగా,  న్యాయం కోసం పోరాడే యోధుడుగా ఇలా పలు విలక్షణమైన పాత్రల్లో అలరించారు జగపతిబాబు. అయితే హీరోగా తన స్టార్ డమ్ మసకబారుతున్న సమయంలోనే జగపతిబాబు కేరెక్టర్ రోల్స్ వైపు మళ్ళారు. అయితే ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం 'లెజెండ్' అనే చెప్పాలి. ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత జగపతిబాబు కాల్ షీట్స్ కు ఎంత డిమాండ్ పెరిగిందో అందరికీ తెలుసు. పరభాషా దర్శకులు సైతం ఆయనను తమ చిత్రాల్లో నటించమని కోరుతున్నారు. బిజీబిజీగా సాగుతున్న జగపతిబాబు రాబోయే చిత్రాల్లోనూ అలరిస్తారని ఆశిద్దాం.