మైనర్ బాలుడి ఆస్తిపై తల్లికి అధికారం లేదు

మైనర్ బాలుడి ఆస్తిపై తల్లికి అధికారం లేదు

మైనర్ బాలుడి ఆస్తిని వేరొకరికి బదలాయించేందుకు/అమ్మేందుకు తల్లికి అధికారం లేదని సంచలన తీర్పునిచ్చింది బాంబే హైకోర్ట్ ఔరంగబాద్ బెంచ్. తల్లి చట్టపరమైన సంరక్షకురాలు కానందువల్ల ఆమెకి మైనర్ కుమారుడి ఆస్తిపై ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేసింది. ‘మైనర్ బాలుడికి హిందూ ఉమ్మడి కుటుంబ ఆస్తి వారసత్వంగా సంక్రమించి ఆ బాలుడి తండ్రి ఆలనాపాలనా అతని ఆలనా పాలనా చూడనప్పటికీ తల్లి సహజ సంరక్షకురాలు కాజాలదు. అందువల్ల వాస్తవిక సంరక్షకురాలిగా తల్లి తన మైనర్ బిడ్డకి సంక్రమించిన ఆస్తిని వేరొకరికి అప్పజెప్పేందుకు ఎలాంటి అధికారం ఉండదని’ జస్టిస్ ఎఎం ధవళే చెప్పారు.

1989లో తన కొడుకు ఆస్తిని అతని తల్లి కుశవర్తబాయి పౌల్ అమ్మేయడాన్ని సవాల్ చేస్తూ ఆ కుమారుడు, అతని తండ్రి వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ అమ్మకాన్ని అక్రమమని, చెల్లదని ప్రకటించాల్సిందిగా వాదులిద్దరూ కోర్టును కోరారు. అయితే ప్రతివాదిగా ఉన్న శివాజీ పౌల్ ఈ వాదనని వ్యతిరేకించారు. అప్పటి చట్టపరమైన అవసరాల రీత్యా, మైనర్ ప్రయోజనం కోసమే ఆమె తనకు ఆస్తి అమ్మిందని వాదించారు. తండ్రి జీవించి ఉండగా మైనర్ తల్లి సహజ సంరక్షకురాలు కాదని.. అందువల్ల మైనర్ తరఫున ఎలాంటి అమ్మకం ఒప్పందాలు కుదుర్చుకొనే అధికారాలు లేవని ట్రయల్ కోర్టు చెప్పింది. ఈ కేసులో అమ్మాల్సిన చట్టపరమైన అవసరమేదీ లేదని తెలిపింది. ఈ వాదనని మొదటి అప్పిలేట్ కోర్టు తోసి పుచ్చింది. దీంతో ఆ తీర్పుని సవాల్ చేస్తూ రెండో అప్పీలు చేశారు.

మొదటి అప్పీలేట్ తీర్పు సమ్మతం కాబోదని హైకోర్ట్ తెలిపింది. ‘కోర్టు ముందుంచిన పరిస్థితులను చూస్తే తల్లిని సహజ సంరక్షకురాలిగా నిర్ధారించేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. అందువల్ల తల్లి కుదుర్చుకొన్న అమ్మకం ఒప్పందం చెల్లదు. దానిని సవాలు చేస్తూ వేసిన దావా, దానిని అప్పగించాలని శాశ్వత ఉత్తర్వులు కోరడం అర్థం చేసుకోదగినది.’ ఆస్తిపై అధికారాలు పోయే ప్రమాదం, వాస్తవ తొలగింపు ఉన్నందున సేల్ డీడ్ చెల్లదని కోరుతూ కోర్టుకు వెళ్లేందుకు మైనర్ మెజారిటీ వచ్చే వరకు వేచి చూడనక్కర్లేదని తెలిపింది.