మేం తెలంగాణ ప్రజలకు బి-టీమ్: కవిత

మేం తెలంగాణ ప్రజలకు బి-టీమ్: కవిత

కాంగ్రెస్ వాళ్లు మా పార్టీ బీజేపీకి బి-టీమ్ అంటున్నారు.. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కు బి-టీమ్ అంటున్నారు.. కానీ మేం తెలంగాణ ప్రజలకు బి-టీమ్ అని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ... మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శం. దేశంలోని కొన్ని రాష్ట్రాలు రైతుబందు అమలు చేస్తున్నాయన్నారు. కిసాన్ సమ్మాన్ ను ఎన్నికల ముందు ప్రకటించడం రైతులను మోసం చేయడమే అని పేర్కొన్నారు. రైతుబంధు అమలుకు ముందే మనం భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. బీజేపీ రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో భూముల వివరాలు సరిగా లేవని కవిత అన్నారు.

రాహుల్ గాందీ పేదలకు నెలకింత అని ఇస్తారట. నానమ్మ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తే.. ఆయన దానికి భిన్నంగా ఆలోచన చేస్తున్నారని కవిత విమర్శించారు. రాజకీయ చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి, అందుకు సైనికుల్లా ప్రజల పక్షాన పోరాడుతాం అని పిలుపునిచ్చారు. 19న నిజామాబాదులో జరిగే సీఎం బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరానున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా సాయంత్రం సభ నిర్వహిస్తున్నాం అని తెలిపారు.