చంద్రబాబు ఆఫర్‌ను తిరస్కరించిన కేశినేని నాని..

చంద్రబాబు ఆఫర్‌ను తిరస్కరించిన కేశినేని నాని..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని.. టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమైన ఏపీ మాజీ సీఎం... ఈ సందర్భంగా లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, అనూహ్యంగా లోక్‌సభలో పార్టీ విప్‌గా ఉండడానికి నిరాకరించారు ఎంపీ కేశినేని నాని... తాను విప్‌గా ఉండలేనంటూ స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేశినేని... లోక్‌సభలో పార్టీ విప్ పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, నా బదులు.. నాకంటే సమర్ధుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేశారు. అంత పెద్ద పదవి చేపట్టడానికి నేను అనర్హుడినని భావిస్తున్నానన్న ఆయన... విజయవాడ ప్రజలు నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు.. వారి ఆశీస్సులు నాకున్నాయని.. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఈ  సందర్భంగా మరోసారి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు ఎంపీ కేశినేని నాని. కాగా, కేశినేని నాని త్వరలోనే పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన సైకిల్ దిగుతాడని.. కమలం గూటికి చేరతారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.