మళ్లీ పీవీపీ, కేశినేని వార్ స్టార్ట్..! పళ్లు రాలగొడతారట..!

మళ్లీ పీవీపీ, కేశినేని వార్ స్టార్ట్..! పళ్లు రాలగొడతారట..!

సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని... వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. వీరి ట్వీట్లతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది.. ఆ తర్వాత మీడియాకెక్కింది. పరస్పరం సవాళ్లు విసురుకునేంత వరకూ వెళ్లింది. ఓ దశలో బూతుపురాణమే నడిచింది. ఎవరైనా ఓ ట్వీట్ చేశారంటే..! ఆ వెంటనే మరొకరు దానికి కౌంటర్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు ఇద్దరు నేతలు.. అయితే కాస్త గ్యాప్ ఇచ్చిన నేతల మధ్య ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ చిచ్చు పెట్టేంది..! అదేంటి? దేశ ఆర్థిక వ్యవస్థతో ఇద్దరు నేతలకు ముడి పడి ఉన్న అంశమేంటనే ఆశ్చర్యపోతున్నారేమో.. ఆర్థిక మందగమనంపై ఓ ట్వీట్ చేశారు ఎంపీ కేశినేని నాని.. "దేశంలో ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేయడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని.. అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే.. ఈ సమయంలో ఏపీ ఆర్థిక అద్భుతాలు సృష్టించేదని.. కానీ, ఇప్పుడా అవకాశం కోల్పోయామని ట్వీట్ చేశారు." ఆయన ట్వీట్లో 'ressision' రాసుకొచ్చారు. 

అయితే దీనిపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు పీవీపీ.. 'ressision' స్పెల్లింగ్‌ను పాయింటౌట్ చేసిన ఆయన మిస్టర్ ఎంపీ, 'RECESSION' స్పెల్లింగ్ కూడా రాని వాడివి.. మా కర్మ కాకపోతే, నీకెందుకయ్యా, ఎకానమీ గురించి స్టేట్మెంట్స్! అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. కొన్ని గంటల తర్వాత మరింత ఘాటుగా మరో ట్వీట్ చేశారు.. "చదువు సంధ్య లేని బజారు మనుషులు కూడా మాట్లాడడం మన తెలుగు ప్రజల కర్మ. ఇష్యూ డైవర్ట్ చెయ్యకు, కావాలంటే ఇంగ్లీష్, తెలుగు ట్యూషన్ మాస్టర్స్ పంపిస్తాను! పిచ్చి వాగుడు కట్టిపెట్టి, వొళ్ళు వంచి పనిచేయరా బడుద్దాయ్! లేదంటే , నీ ఇంటికొస్తా, నీ ఆఫీసుకొస్తా, ఎక్కడున్నా వచ్చి నీ పళ్ళు రాలగొడతా! '' అంటూ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని.. "ఆర్థిక నేరస్థులు కూడా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగానని భావించటం అంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి పట్టిన కర్మే." అని ట్వీట్ చేశారు. ఇలా మొత్తానికి ఆర్థిక మందగమనం మరోసారి ఇద్దరు నేతల మధ్య చిచ్చుపెట్టింది.