జగన్‌ అలా రాసిస్తే రాజీనామా చేస్తా..! రెబల్‌ ఎంపీ ప్రతిసవాల్‌

జగన్‌ అలా రాసిస్తే రాజీనామా చేస్తా..! రెబల్‌ ఎంపీ ప్రతిసవాల్‌

సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేయడంతో.. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రఘురామకృష్ణంరాజుపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. పార్టీలో ఉండడం ఇష్టంలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలనే డిమాండ్ లేకపోలేదు. తాజాగా, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా.. రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు.. దీనిపై స్పందించిన రెబల్ ఎంపీ... ప్రతి సవాల్ విసిరారు.. మా పార్టీ (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ)కి చెడ్డ పేరు రాకూడదనే అమరావతి రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సూచిస్తున్నాన్న ఆయన.. నేను రాజీనామా చేసి నెగ్గితే  అమరావతే రాజధానిగా ఉంటుందని రాసి ఇచ్చేందుకు మీ ముఖ్యమంత్రిని  ఒప్పిస్తారా? అంటూ ప్రతి సవాల్ చేశారు. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే నా గెలుపును అమరావతిపై రెఫరెండంగా స్వీకరించేందుకు మీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సిద్ధమేనా? అని ప్రశ్నించారు రఘురామకృష్ణంరాజు. దీంతో.. రాజీనామా డిమాండ్‌ కాస్త మరింత కాకరేపినట్టు అయ్యింది. హిందూ దేవాలయాల పై దాడులను ఖండిస్తూ ఒకరోజు నిరసన దీక్ష చేసిన ఎంపీ రఘు రామకృష్ణ రాజు.. తన దీక్ష ముగింపు సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.