ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే..

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే..

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని అభిప్రాయపడుతున్నట్టు ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరే అంశాల కోసం పాటుపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే అక్కడ క్రమశిక్షణ కలిగిన ఓ సైనికుడిలా పనిచేశానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తనతో పాటు మరో ముగ్గురు కూడా బీజేపీలో చేరారన్నారు. జాతి నిర్మాణం కోసం బీజేపీతో కలిసి పనిచేయాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సుజనా స్పష్టంచేశారు. తమ చేరికతో ఏపీ విభజన చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నానన్నారు. దేశాభివృద్ధికి నరేంద్ర మోడీయే సరైన నాయకుడని నమ్ముతున్నానని అన్నారు. 

'తనపై ఎలాంటి ఫిర్యాదు, ఛార్జిషీటూ లేదు. ఇటీవల వచ్చినవి కూడా అభియోగాలు మాత్రమే. రాజ్యాంగం ప్రకారం అనుమానం వస్తే ఎవరినైనా విచారించవచ్చు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. 2004లోనే తాను వ్యాపారం నుంచి బయటకు వచ్చాను. వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ రూపంలో ఇవ్వడానికి సిద్ధపడింది. ఏపీకి ప్యాకేజీ కోసం తానూ పాటు పడ్డాను. ఆంధ్రప్రదేశ్‌కు ఏది మంచిదో దానికోసం కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబు ఎప్పటికీ తనకు రాజకీయ గురువే. రాజకీయాల్లో ఓనమాలు నేర్పించిందే ఆయన. 2004 నుంచి తాను పార్టీలోనే ఉన్నా, కష్టకాలంలోనూ కొనసాగాను. పార్టీ అభివృద్ధి కోసం తాను ఎంత కష్టపడ్డానో చంద్రబాబుకు తెలుసు. ఏపీలో టీడీపీ నిలదొక్కుకోవాలని ఆకాంక్షించే తొలి వరుస వ్యక్తుల్లో తాను ఒకరిని' అని సుజనా చౌదరి అన్నారు.