విజయారెడ్డిని హత్య చేసిన సురేష్ మృతి

విజయారెడ్డిని హత్య చేసిన సురేష్ మృతి


తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆనాటి ఘటనలో అతనికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 60 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో 4 రోజులుగా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన సురేష్‌ చివరికి చనిపోయాడు. ఆరోగ్య పరిస్థితి  విషమించడంతో ఈ ఉదయం నుంచీ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్సకు సురేష్‌ శరీరం సహకరించలేదని సమాచారం. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సురేష్ అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాలిన గాయాలతో ఉన్న సురేష్‌ ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బర్న్ షాక్‌లో ఉన్న సురేష్ పరిస్థితి నిన్నటికి మరింత విషమించింది. దీంతో సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కొంతకాలంగా భూ పట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని సురేష్ తెలిపాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందనే కారణంగానే ఆమెపై కక్ష పెంచుకున్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.