ముంబై విజయంపై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబై విజయంపై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో చివరకు ఒకే ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్ 2019 సీజన్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది ముంబై ఇండియన్స్ జట్టు. అయితే, ముంబై విజయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ... మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ఇది సరదాగా సాగిన మ్యాచ్‌. ట్రోఫీని ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకరి నుంచి ఒకరం మార్చుకుంటున్నాం. అయితే, ఛాంపియన్‌ను నిర్ణయించే కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో తప్పులు చేస్తే పరిహారం చెల్లించుకోక తప్పదు.. ఈ మ్యాచ్‌లో ఇటు మేం, అటు వాళ్లు... ఇలా రెండు జట్లూ పొరపాట్లు చేశాయి. కానీ, ముంబై జట్టు మాకంటే పొరపాట్లు తక్కువ చేసింది. అందుకే టైటిల్ గెలిచిందన్నారు. ఇక ఛాంపియన్‌గా నిలిచేందుకు ముంబై జట్టుకు పూర్తి అర్హత ఉందన్న ధోనీ... అందుకే పైచేయి సాధించిందన్నారు. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశారని కొనియాడారు ధోనీ... ఈ పిచ్‌పై 150 పరుగులకే ప్రత్యర్థిని కట్టడం చేయడం సులువైన పనికాదన్న మిస్టర్ కూల్.. వికెట్‌ అవసరమైన ప్రతీసారి బౌలర్లు వికెట్లు తీశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఇది మంచి సీజన్‌. మిడిల్‌ ఆర్డర్‌లో కొంచెం విఫలమైంది. వీటన్నింటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.