అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని...

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని...

భారత మాజీ కెప్టెన్, అన్ని మూడు ఐసీసీ ట్రోఫీలు లు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. చాల రోజులుగా ఈ విషయం పై చర్చ నడుస్తున్న తరుణం లో ఎవరు ఊహించని విధంగా ఈ రోజు భారత దేశ 74 వ స్వాతంత్ర్య దినోత్సవం  రోజున ఇంస్టాగ్రామ్ వేదికగా తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అందులో మీరు చూపించిన ప్రేమకు అలాగే నాకు మీరు ఇచ్చిన మద్దతుకు చాలా ధన్యవాదాలు అంటూ తన ఫొటోలతో రన్ అవుతున్న వీడియోను పోస్ట్ చేసాడు ధోని. 

7 జులై 1981 రాంచి లో జన్మించ్చిన ధోని 23 డిసెంబర్ 2004లో భారత జట్టు తరపున  వన్డే  అరంగేట్రం చేసాడు.ధోని జట్టులోకి వచ్చిన మొదట్లో తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేదు. 2005 లో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ చివరి మ్యాచ్ లో 123 బంతుల్లో 148  పరుగులతో చెలరేగిపోయాడు. ఇక ఆ తర్వాత నుండి అతను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇక అదే ఏడాది శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో 145 బంతుల్లో 183 పరుగులు బాది అప్పటివరకు భారత్  తరపున వన్డే లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.  ఆ ప్రదర్శనతో అదే సంవత్సరం టెస్ట్ మ్యాచ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2007టీ 20 ప్రపంచ కప్ కు ముందు అనుకోకుండా భారత పగ్గాలు అందుకున్న ధోని ఆ టోర్నమెంట్ చివరి మ్యాచ్ లో భారత చిరకాల ప్రత్యర్థి అయిన  పాకిస్థాన్ పై  తన తెలివితో విజయంసాధించి  జట్టుకు ట్రోఫీ అందించి తానేంటోనిరూపించుకున్నాడు. 

ఇక 2008, 2009 లోధోని వరుసగా ఐసీసీ వన్డే ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. అయితే అప్పటివరకు ఈ అవార్డు ను రెండుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడు ధోనీనే.  కెప్టెన్ గా ఎంపికైన తర్వాత నుండి జట్టును విజయ పథంలో నడిపిస్తున్న ధోని 2011 లో భారత 28 ఏళ్ళ కలను నెరవేర్చాడు. 2011 లో జరిగిన వన్డే  ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో 79 బంతుల్లో 91 పరుగులు తో  నాట్ ఔట్  నిలిచి భారత్  కు ప్రపంచ కప్ అందించాడు. అయితే అప్పటికే బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నా ధోని ఆ మ్యాచ్ చివర్లో కొట్టిన సిక్స్ భారత క్రికెట్  చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయేఘటన. 

1983 లో కపిల్ దేవ్ తర్వాత మళ్ళీ  28 ఏళ్లకు ఈ టైటిల్ అందుకున్న రెండో భారత  కెప్టెన్ ధోని. ఇక ఆ తర్వాత మరో రెండు సంవత్సరాలకి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు సాధించని రికార్డును ధోని సాధించాడు. 2013 ఛాంపియన్ ట్రోఫీ విజయం తో క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా నిలిచ్చాడు ధోని. కేవలం భారత జట్టునే కాకుండా ఐపీఎల్ లోతన  చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు సార్లు టైటిల్ అందించాడు. 

అటువంటి ధోని ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నమెంట్ల ఓటముల తర్వాత 2017 జనవరి లో వన్డే మరియు టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఇక అప్పటినుండి ధోని కెరియర్ పై అనుమానాలు మొదలయ్యాయి. అలాగే తన రిటైర్మెంట్ ప్రశ్న వెలుగులోకి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత నుండి జట్టుకి దూరం గా ఉంటున్నాడు  అలాగే బీసీసీఐ  తమ కాంట్రాక్టు లో కూడా ధోనికి చోటు కల్పించలేదు. దాంతో అందరి అనుమానాలు ఇంకా  బలపడ్డాయి. కానీ అతనికి కావాల్సిన వారు మాత్రం ధోని వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచ కప్ లో ఆడుతాడు అని భావించారు. కానీ ఈ రోజు ఓ బాంబ్ ల సడన్ గా తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు ధోని. అయితే ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2020 లో ఆడటానికి చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం లో ఉన్నాడు.