వైరల్ వీడియో: ధోనీ రిటైర్మెంట్ ప్లాన్ ఏంటంటే...

వైరల్ వీడియో: ధోనీ రిటైర్మెంట్ ప్లాన్ ఏంటంటే...

తన కెప్టెన్సీలో టీమిండియాను రెండు సార్లు వరల్డ్ కప్ చాంపియన్ (టీ20 వరల్డ్ కప్ 2007, వరల్డ్ కప్ 2011)గా నిలిపిన ఎంఎస్ ధోనీ తన క్రికెట్ కెరీర్ చివరి మెట్టుపై ఉన్నాడు. 37 ఏళ్ల ధోనీ వరల్డ్ కప్ 2019 తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడనే వార్తలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. స్వయంగా ధోనీ ఈ చర్చకు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్ నుంచి 2014లో సన్యాసం తీసుకున్న ధోనీ, ప్రస్తుతం టీ20, వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. రిటైరయ్యాక ఏం చేస్తాడో ధోనీ సూచనప్రాయంగా చెప్పేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ధోనీ పెయింటింగ్ వేస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో ధోనీ తనలో దాగున్న కళను ప్రదర్శిస్తున్నాడు. వీడియోలో ధోనీ మూడు పెయింటింగ్స్ చూపిస్తూ 'నేను మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఆర్టిస్ట్ కావాలని కోరిక. నేను చాలా క్రికెట్ ఆడేశాను. ఇక ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఎన్నాళ్లుగానో చేయాలనుకుంటున్నది చేసే సమయం వచ్చిందని భావిస్తున్నాను. అందుకే నేను పెయింటింగ్ వేశాను' అని చెప్పాడు.

మొదటి పెయింటింగ్ ఒక ల్యాండ్ స్కేప్ ది. రెండో పెయింటింగ్ ఏదైనా ప్రయాణ సాధనం కావచ్చని ధోనీ చెప్పాడు. మూడో పెయింటింగ్ తనకెంతో ఇష్టమని ధోనీ తెలిపాడు. ఈ పెయింటింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తన టీమ్ చెన్నయ్ సూపర్ కింగ్స్ జెర్సీలో బ్యాటింగ్ చేస్తున్నది. ధోనీ 90 టెస్టుల్లో 4876 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు ఉన్నాయి. అతను ఇప్పటి వరకు 341 వన్డేలు, 98 టీ20 మ్యాచ్ లు ఆడాడు.