క్వాలిఫయర్ 2 కోసం వైజాగ్ వచ్చిన ధోనీ

క్వాలిఫయర్ 2 కోసం వైజాగ్ వచ్చిన ధోనీ

నిన్న చెన్నైలోని జరిగిన క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన చెన్నై సూపర్ కింగ్స్ తమ రెండో క్వాలిఫయర్ ఆడేందుకు సాగర నగరం వైజాగ్ కి వచ్చింది. భార్యాబిడ్డలతో విశాఖకు చేరుకున్న సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వైజాగీలు ఘనస్వాగతం పలికారు. ఎల్లుండి (మే 10, శుక్రవారం) జరిగే మ్యాచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎస్కే యాజమాన్యం ఎల్లో బెటాలియన్ విశాఖపట్నం చేరుకుందంటూ ధోనీ, సాక్షి ధోనీ, జివాలు వైజాగ్ ఎయిర్ పోర్ట్ బయటికి నడుచుకుంటూ వస్తున్న ఫోటోని ట్వీట్ చేసింది. 

నిన్న చెన్నైలో జరిగిన మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్ జట్టు టాపార్డర్ ఘోరంగా విఫలమవ్వడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులే చేయగలిగింది. అంబటి రాయుడు ‌(42), ధోనీ(37) మాత్రమే రాణించారు. వీళ్లిద్దరి 66 పరుగుల భాగస్వామ్యంతో చెన్నై ఆ స్కోర్‌ చేరగలిగింది. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నై ఇన్నింగ్స్ ని మురళీవిజయ్‌(26), అంబటి రాయుడు గాడిలో పెట్టారు. ముంబై బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు, కృనాల్‌ పాండ్య, జయంత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. 4 ఓవర్లలో 22 రన్స్ కే ఓపెనర్లని కోల్పోయిన ముంబైని సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యతో కలిసి జట్టుని ఫైనల్స్ కి తీసుకెళ్లాడు.