ధోని రిటైర్ అవుతున్నాడా?

ధోని రిటైర్ అవుతున్నాడా?

సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్‌ కోల్పోవడంతో అభిమానులు కొందరి ఆటగాళ్ల ఆటతీరు పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనిపై భారీ స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ధోనిని ఇంకా ఎందుకు ఆడిస్తున్నారంటూ అభిమానులు కెప్టెన్‌, సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటరైనా తాను ఆడిన చివరి మ్యాచ్‌కు సంబంధించిన బాల్ గానీ వికెట్‌ను గానీ తీసుకొని గుర్తుగా ఉంచుకుంటారు. మంగళవారం మూడో వన్డే మ్యాచ్‌ అనంతరం ధోని అంపైర్ల నుంచి బంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడా? అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతకుముందు 2014లో ఆస్ట్రేలియాతో ఆడిన చివరి టెస్ట్ ముగిసిన అనంతరం ధోని ఓ వికెట్‌ను తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌ తర్వాతే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  మంగళవారం కూడా మ్యాచ్‌ అనంతరం బాల్‌ తీసుకోవడంతో ధోని ఏ క్షణంలో అయినా రిటైర్మెంట్‌ ప్రకిటించే అవకాశం ఉందని తెలుస్తుంది. 2019 వరల్డ్ కప్ వరకు ఆడుతా  అని ఇంతకుముందు ధోని, కోచ్ చెప్పారు.. మరి ఇప్పుడు బాల్ తీసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. మరి ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలి.