రిటైర్మెంట్ తర్వాత ధోనీ కొత్త ఇన్నింగ్స్‌ ఇదేనా..?

రిటైర్మెంట్ తర్వాత ధోనీ కొత్త ఇన్నింగ్స్‌ ఇదేనా..?

టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ వ్యవహారంపై ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఓవైపు వరల్డ్ కప్‌ తర్వాత ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెబుతాడనే చర్చ జోరుగా సాగుతుండగా... మరోవైపు రిట్మైర్మెంట్ తర్వాత ధోనీ ఏం చేయబోతున్నాడు అనే దానిపై కూడా కథనాలు వస్తున్నాయి. రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ రాజకీయాల్లో చేరుతాడనే ప్రచారం వినిపిస్తోంది. బీజేపీ అభిమానులు సోషల్ మీడియాల్లో ఈ ప్రచారానికి తెరలేపారు. బీజేపీ చీఫ్ అమిత్‌షాతో ధోనీ కలిసివున్న ఫోటోలను షేర్ చేసి.. ఇదిగో ధోనీ వచ్చేస్తున్నాడంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక, సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి.. కానీ, అక్టోబర్‌లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. అయితే, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంఎస్ ధోనీ ప్రచారం చేస్తాడంటూ "సండే గార్డియన్‌" పత్రిక తన కథనంలో పేర్కొంది. వరల్డ్ కప్ ముగించుకుని స్వదేశానికి రాగానే ధోనీ.. బీజేపీ కండువా కప్పుకుంటాడని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోందని తన కథనంలో వెల్లడించింది. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉండడం.. ముఖ్యంగా గిరిజనుల్లో అసంతృప్తి నెలకొని ఉండడంతో.. ధోనీ పాపులారిటీని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని.. అంతేకాదు.. జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలను ఎదుర్కోవడానికి జార్ఖండ్‌లో ధోనీ ప్రజాదరణను ఉపయోగపడుతోందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. పార్టీలో చేరేందుకు ధోనీ విముకత వ్యక్తం చేస్తే.. కనీసం ప్రచారానికైనా ధోనీని వాడుకోవాలనే భావన బీజేపీ నేతల్లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.