ధోనీ కోపానికి దీపక్ చహార్ బలయ్యాడు

ధోనీ కోపానికి దీపక్ చహార్ బలయ్యాడు

మైదానంలో ప్రతికూల పరిస్థితులెదురైనా చెక్కుచెదరని నిబ్బరంతో కనిపిస్తాడని అంతా ఎంఎస్ ధోనీ కెప్టెన్ కూల్ అని పిలుస్తారు. అసలు కోపం అంటే ఏంటో తెలియనట్టు ఉంటాడు ఎంఎస్. అలాంటి ధోనీ ఇవాళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ప్రస్తుత ఐపీఎల్ లో కీలక సమయాల్లో మహేంద్రుడు దీపక్ చహార్ పైనే ఆధారపడుతున్నాడు. చహార్ కూడా కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆడుతున్నాడు. శనివారం చెన్నైలో జరిగిన మ్యాచ్ లో 19వ ఓవర్ వేయడానికి వచ్చిన దీపక్ కి ధోనీ గట్టి క్లాస్ తీసుకున్నాడు. గెలిచేందుకు పంజాబ్ జట్టుకి 12 బంతుల్లో 39 పరుగులు కావాలి. ఓవర్ ప్రారంభంలోనే వరుసగా చహార్ నోబాల్స్ వేశాడు. నడుంపైకి ఫుల్ టాస్ లు వేయడంతో రెండు ఫ్రీ హిట్స్ వచ్చాయి. దీంతో చిర్రెత్తిపోయిన ధోనీ బౌలర్ దగ్గరకు వెళ్లి సీరియస్ క్లాస్ పీకాడు.

బౌలింగ్ కి వచ్చినపుడు భయపడుతున్నట్టు కనిపించిన చహార్, ధోనీ సలహా తర్వాత మెరుగ్గా బౌలింగ్ చేశాడు. తన ఓవర్ చివరి బంతికి ప్రమాదకరమైన డేవిడ్ మిల్లర్ వికెట్ తీశాడు. ఆ ఓవర్ లో 13 పరుగులు మాత్రమే రావడంతో పంజాబ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 

స్కాట్ కుగెలిజిన్ వేసిన చివరి ఓవర్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 26 పరుగులు చేయడంలో విఫలం కావడంతో సీఎస్కే 22 పరుగుల తేడాతో విజయం సాధించి పట్టికలో అగ్రస్థానాన నిలిచింది.