రిటైర్మెంట్..! ధోనీ మనస్సులో ఏముంది..?

రిటైర్మెంట్..! ధోనీ మనస్సులో ఏముంది..?

భారత క్రికెట్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించి.. తనకంటూ ప్రత్యేక ముద్ర సంపాదించుకున్న మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రిటైర్మెంట్‌ గురించి గత కొంత కాలంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వరల్డ్‌కప్ నుండి మిస్టర్ కూల్ రిటైర్మెంట్‌ వార్తలు మొదలయ్యాయి. మెగాటోర్ని అనంతరం మాజీ కెప్టెన్ రిటైర్ అవ్వడం ఖాయమని అందరు భావించారు. దీనికి తోడు ధోనీ అటతీరు కూడా తోడవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనిపైన ధోనీ కూడా ఏనాడూ స్పందించింది కూడా లేదు. అయితే తాజాగా మళ్లీ మిస్టర్ కూల్ రిటైర్మెంట్‌ వార్తలు తెర పైకి వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ధోనీ రిటైర్మెంట్‌ పై ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీటిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చేంత వరకు ఆ వార్తలు ఆగలేదు.

ధోనీని చూస్తే రిటైర్మెంట్‌పై సరియైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధోనీ వయసు 38.. రెండు నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. నవంబర్‌ వరకు అందుబాటులో ఉండడు. బంగ్లాదేశ్‌ సిరీస్‌కూ దూరమే. ఇప్పటికే సీనియర్‌, భారత్‌-ఏ జట్ల కోసం మ్యాచ్‌ల షెడ్యూలు, శిక్షణ, డోపింగ్‌ నిరోధ పరీక్షల ప్రణాళికలను బీసీసీఐ సిద్ధం చేసింది. ఇందులో ఎక్కడా ధోనీ పేరు లేదు. అంటే అతడు జార్ఖండ్‌ తరఫున విజయ్‌ హాజరే సైతం ఆడటం లేదని తెలుస్తోంది. దీంతో అతడి పరిస్థితి, ఆలోచనలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు మాజీ క్రికెటర్లు ధోనీ రిటైర్‌పై భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ నాటికి ధోనీకి 39 ఏళ్లకు చేరతాడు. ఈ వయసులో క్రికెట్ ఆడటం చాలా కష్టమని గవాస్కర్ తెలిపాడు. ధోనీ రిటైర్మెంట్‌కు విలువ దక్కాలంటే అతనే తొందరగా నిర్ణయం తీసుకోవాలని సన్నీ సూచించాడు. గంగూలీ మాత్రం ధోనీ వచ్చే టీ-20 వరల్డ్‌కప్‌లో ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ ప్రశ్నలన్నింటీకీ ధోనినే సమాధానం చెప్పాలి. మరి మిస్టర్‌ కూల్‌ మదిలో ఏముందో తెలియాల్సి ఉంది.