చహల్‌ను చూసి ధోనీ పరుగు...

చహల్‌ను చూసి ధోనీ పరుగు...

టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ టీవీ అందరికీ తెలిసిందే. గత నెల ఆసీస్ గడ్డపై జరిగిన వన్డే సిరీస్ నుండి చహల్‌ టీవీ యాంకర్‌ అవతారమెత్తి మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లను ఇంటర్య్వూ చేస్తున్నాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ, షమీ, కేదార్ జాదవ్ లను చహల్‌ ఇంటర్య్వూ చేసాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ వంతు కూడా వచ్చింది.

కివీస్‌తో జరిగిన ఐదో వన్డేలో 35 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ ముగిసిన అనంతరం అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా చహల్‌ తన ‘చాహల్‌ టీవీ’తో మాట్లాడాల్సిందిగా ధోనీ ముందు మైక్‌ ఉంచాడు. మాట్లాడేందుకు ధోనీ నిరాకరించినా.. మాట్లాడాల్సిందేనంటూ చాహల్‌ పట్టుబట్టాడు. దీంతో ధోనీ అక్కడి నుంచి తప్పించుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌పైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ధోనీ సరదాకో, సీరియ్‌సగానో తెలియదు గానీ.. చహల్‌ను చూసి పారిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'ప్రపంచంలోని ఏ బౌలర్‌ ధోనీని భయపెట్టలేదు.. కానీ చహల్‌ భయపెట్టాడు' అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.