పొట్టి సమరం నేటి నుంచే..

పొట్టి సమరం నేటి నుంచే..

క్రికెట్‌లో ఉరిమే ఉత్సాహం తీసుకొచ్చిన పొట్టి క్రికెట్ ఫార్మాట్‌ 12వ సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది... క్రికెట్‌ ప్రేమికుల ఫేవరెట్‌ లీగ్‌ మారిపోయిన ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. లీగ్‌ 12వ సీజన్‌కు ఇవాళే శ్రీకారం చుట్టనున్నారు. తొలి మ్యాచ్‌లో ఎంఎస్ ధోని జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌ను.. కోహ్లీ సేన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఢీకొట్టేందుకు సిద్ధమైపోయింది. ఇక ఐసీఎల్‌ లీగ్‌లో చెన్నై అత్యంత విజయవంతమైన జట్టు.. మూడుసార్లు టైటిల్‌ గెలిచింది. మరోవైపు బెంగళూరు ఒక్కసారీ విజేత కాలేదు. రెండేళ్ల నిషేధం తర్వాత పెద్దగా అంచనాల్లేకుండా గత సీజన్‌లో బరిలోకి దిగిన ధోనీసేన అద్భుత ప్రదర్శనతో మరోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. బెంగళూరు మాత్రం పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ.. మరోసారి లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది... చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఈ తొలి పోరు రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో వాట్సన్‌, డుప్లెసిస్‌, సురేష్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, జాదవ్‌, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, డేవిడ్‌ విల్లీ, మోహిత్‌ శర్మకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉండగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌లో పార్థివ్‌ పటేల్‌, మొయిన్‌ అలీ, విరాట్ కోహ్లి, డివిలియర్స్‌, హెట్‌మయర్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, చాహల్‌కు స్థానం లభించే అవకాశం ఉంది.