ధోనీ రిటైర్మెంటా...అదేం లేదే !

ధోనీ రిటైర్మెంటా...అదేం లేదే !

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్ కాబోతున్నాడని ఈరోజు ఏడు గంటలకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయం మీద ప్రకటన చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈరోజు ప్రెస్ మీట్ ఉంటుందని ప్రకటించిన క్షణం నుండే ఈ ప్రచారం కూడా మొదలయ్యింది. ఈ క్రమంలో ఆ ప్రచారాలను, వార్తలను బీసీసీఐ ఖండించింది. ఈ వార్తలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపింది. ధోనీ రిటైర్మెంట్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని చిఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.  ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపడేశారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన సందర్భంగా ఎమ్మెస్కే ఈ మేరకు స్పందించారు.

నిజానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఒక ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చింది. సందర్భమేమీ లేకపోయినా 2016 టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ "ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మనిషి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పరిగెత్తించినట్టు నన్ను పరిగెత్తించాడు" అంటూ ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ కోహ్లీ కామెంట్ పెట్టాడు. గురువారం రాత్రి 7 గంటలకు ధోని మీడియా సమావేశం నిర్వహించడానికి కూడా సిద్ధమయ్యాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో ఆయన రిటైర్మెంట్ గురించి ప్రచారం మొదలయ్యింది.