ముకేష్‌ను మించిన సంపన్నుడు లేడు

ముకేష్‌ను మించిన సంపన్నుడు లేడు

భారత దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో వరుసగా 11వ సారి కూడా అగ్రస్థానంలో నిలిచారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన 100 మంది భారతీయ జాబితాలో మళ్లీ ముకేశ్‌కు ఫస్ట్ ప్లేస్‌ దక్కింది. వీరి ఆస్తులు దాదాపు 492 బిలియన్‌ డాలర్లుగా ఫోర్బ్స్‌ తన జాబితాలో వెల్లడించింది. గత ఏడాది విలువ 479 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది 2.7శాతం మేర పెరిగింది. రూపాయి పతనం, భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రతికూలతల నేపథ్యంలోనూ ముకేశ్‌ అంబానీ సంపద రూ.68 వేల కోట్ల మేర వృద్ధి చెందిందని... ఇందుకు ప్రధాన కారణం రిలయన్స్ జియోనే పేర్కొంది. ఇక విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవగా... ఆర్సెలార్‌ మిత్తల్‌ ఛైర్మన్‌-సీఈఓ లక్ష్మీ మిట్టల్‌ మూడు స్థానంలో ఉన్నారు. మరోవైపు ముగ్గురు మహిళా పారిశ్రామిక వేత్తలకు కూడా ఈ జాబితాలో చోటు కల్పించింది ఫోర్బ్స్... 8.4 బి.డాలర్లతో జిందాల్‌ గ్రూపు వ్యవస్థాపకుడు ఓం ప్రకాశ్‌ జిందాల్‌ భార్య సావిత్రి జిందాల్‌ 14వ స్థానంలో ఉండగా... 3.6 బి.డాలర్లతో బయోకాన్‌ను స్థాపించిన కిరణ్‌ మజుందార్‌ షా 39వ స్థానం, 2.5 బిలియన్‌ డాలర్లతో యూఎస్‌వీ ఇండియా వ్యవస్థాపకుడైన విఠల్‌ గాంధీ కుమార్తె లీనా తివారీ 64వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో నలుగురు తెలుగువారికి కూడా స్థానం దక్కింది. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ పీపీ రెడ్డికి 47వస్థానం దక్కగా... జనరిక్‌ ఔషధాల విభాగంలో అగ్రశ్రేణి కంపెనీ అరబిందో ఫార్మాకు చెందిన పీవీ రాంప్రసాద్‌ రెడ్డికి 50వ స్థానం, దివీస్‌ లేబొరేటరీస్‌ వ్యవస్థాపకులు మురళి దివి 53వ స్థానంలో ఉన్నారు. ఇక డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వ్యవస్థాపకుడైన డాక్టర్‌ అంజిరెడ్డి కుటుంబానికి కూడా ఈ జాబితాలో చోటు కల్పించింది ఫోర్బ్స్.