క‌రోనా క‌ల్లోలం.. అంబానీ దాతృత్వం..

క‌రోనా క‌ల్లోలం.. అంబానీ దాతృత్వం..

క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది.. కొన్ని రాష్ట్రాల్లో దారుణ‌మైన ప‌రిస్థితులుఉన్నాయి.. బెడ్లు దొర‌క్క అంబులెన్సుల్లోనే ట్రీట్‌మెంట్ ఇచ్చే ప‌రిస్థితి.. అంత్య‌క్రియ‌ల ద‌గ్గ‌ర కూడా ర‌ద్దీ.. ఇక‌, క‌రోనా ట్రీట్‌మెంట్‌లో ఆక్సిజ‌న్ పాత్ర కీల‌క‌మైన‌ది.. అయితే, ప‌లు ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ నిల్వ‌లు కూడా లేని ప‌రిస్థితి.. ఇలాంటి స‌మ‌యంలో త‌న వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు ఇండియ‌న్ నంబ‌ర్ వ‌న్ బిలియ‌న‌ర్ ముకేష్ అంబానీ.. మ‌హారాష్ట్ర‌లో కరోనా మ‌హ‌మ్మారిపై పోరుకు త‌న రిఫైన‌రీల‌లో ఉత్ప‌త్తి అయిన ఆక్సిజ‌న్‌ను ముంబైకి పంపిస్తున్నారు. గుజ‌రాత్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన రిఫైనింగ్ కాంప్లెక్స్ క‌లిగి ఉన్న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌.. జామ్‌న‌గ‌ర్ నుంచి మ‌హారాష్ట్ర‌కు ఉచితంగా ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

రిలయన్స్ నుంచి రాష్ట్రానికి 100 టన్నుల గ్యాస్ లభిస్తుందని పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముంబైలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది. రిలయన్స్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. దీంతో రిలయన్స్ తన పెట్రోలియం కోక్ గ్యాసిఫికేషన్ యూనిట్ల కోసం ఉద్దేశించిన కొన్ని ఆక్సిజన్ ప్రవాహాలను వైద్య వినియోగానికి అంద‌జేస్తోంది.. క‌రోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న వేళ ఆస్ప‌త్రుల్లో త‌గినంత ఆక్సిజ‌న్ లేక క‌రోనా పేషెంట్లు మృతిచెందుతున్నారు.. దీంతో త‌న పెట్రోలియం ఉత్ప‌త్తుల కోసం త‌యారు చేస్తున్న ఆక్సిజ‌న్‌లో కొంత భాగాన్ని ఆస్ప‌త్రుల్లో వినియోగించ‌డానికి వీలుగా మార్చి రిల‌యెన్స్ పంపిస్తోంది. మొత్తంగా క‌ష్ట‌కాలంలో తాను ఉన్నానంటూ.. ముందుకు వ‌చ్చారు అంబానీ.